విశాఖ భూ కుంభ‌కోణంలో నాపేరు ఉండటం విచార‌క‌రం: ధ‌ర్మాన‌

-

*అధికార పార్టీ క‌నుస‌న్న‌ల్లో సిట్‌
శ్రీకాకుళం: విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయని, అయినా తాను భయపడనని అన్నారు. వాటిని తామేం పట్టించుకోవడంలేదని, రెవెన్యూలో పనిచేసిన వారందరికీ తెలుసునని, రెవిన్యూ మంత్రి ఈ వ్యవహారాలు చూడరని అన్నారు.

“జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు. ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు. బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల తరపున నిలదీస్తున్నానని, వైఎస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వాటికి నేను భయపడను. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంద”ని వ్యాఖ్యానించారు.

నిర్దోషిత్వం బ‌య‌ట‌ప‌డింది: గంటా

భూ కుంభకోణాలపై సిట్‌ ఇచ్చిన నివేదికతో తన నిర్దోషిత్వం బయటపడిందని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వానికి సిట్‌ నివేదిక సమర్పించిన నేపథ్యంలో విశాఖలో గంటా మీడియాతో మాట్లాడారు. అడిగిన వెంటనే సిట్‌ విచారణకు ఆదేశించిన సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాను అనకాపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఏ ఆస్తులు ఉన్నాయో వాటితోపాటు ఈరోజు తన పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఎవరు అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. తన ఎదుగుదలను చూడలేకే ఆరోపణలు చేశారని గంటా మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version