ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైకాపా ప్రభంజనం కొనసాగుతున్నది. మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 150 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతూ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నది. అయితే వైకాపా గెలుపునకు ప్రధాన కారణం జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో జగన్.. వైకాపా మ్యానిఫెస్టోలో ప్రవేశపెట్టిన నవరత్నాలను ఒకసారి పరిశీలిస్తే…
1. వైఎస్సార్ రైతు భరోసా పేరిట ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం రూ.50వేల పంపిణీ, వ్యవసాయానికి పగటి పూట ఉచితంగా 9 గంటల విద్యుత్ సరఫరా
2. పేదలకు అయ్యే ఆరోగ్య ఖర్చు రూ.1వేయి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపు
3. యువతకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు
4. ఫించన్ల వయో పరిమితి 65 నుంచి 60 ఏళ్లకు తగ్గింపు, ఫించన్ రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంపు
5. విద్యార్థులకు ఫీజు రీయెంబర్స్‌మెంట్, ప్రతి విద్యార్థికి ఏటా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం, అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15వేలు విద్యార్థులకు అందజేత
6. పేదలందరికీ ఇండ్లు
7. జలయజ్ఞం ద్వారా ప్రాజెక్టుల పూర్తి
8. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల రుణ మాఫీ, 0 వడ్డీకే రుణాలు అందజేత
9. మద్యపాన నిషేధం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ నవరత్నాలను చూసే ప్రజలు ఆయన్ను సీఎంగా గెలిపించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వైకాపా ఏపీలో అత్యధిక స్థాయిలో అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకునే దిశగా ఫలితాల్లో దూసుకుపోతోంది.