టీ పీసీసీ చీఫ్ రేసులో తెరపైకి కొత్త పేర్లు..కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన అలజడి

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి మొదలైంది. అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక గడువు కూడా పూర్తవుతుండటంతో కొత్త సారథి పై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వస్తున్న కొత్త పేర్లతో ఆశావహులంతా మళ్లీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ప్రయత్నాలు ప్రారంభించారు.


తెలంగాణ కాంగ్రెస్ లో దాదాపు 3 నెలలుగా పార్టీ నేతలు సైలెంట్‌గా ఉండిపోయారు. కొత్త పీసీసీ అంశంపై ఆశలు పెట్టుకోకుండా పూర్తిగా సాగర్ ఉపఎన్నికపై దృష్టి సారించారు చాలా మంది నాయకులు . ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్ సొంత రాష్ట్రం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ ఉండడంతో ఆయన ఎవరికీ అందుబాటులో లేకపోయారు. దీంతో ఆ దిశగా ఇన్నాళ్లూ అలికిడి లేదు. రేపటితో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పోలింగ్‌ ముగుస్తుంది. మే 2న ఫలితాలు వెల్లడికానున్నా వాటితో సంబంధం లేకుండా పీసీసీ చీఫ్‌ ఎంపికలో కదలిక తీసుకొచ్చే పనిలో ఉన్నారు నాయకులు.

హైకమాండ్‌ పెట్టిన గడువు దగ్గర పడటంతో ఆశావహులపై ఇతరులు కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తోంది. సాగర్‌ ఉపఎన్నిక కోసం ఇంఛార్జ్‌ ఠాగూర్‌ హైదరాబాద్‌ చేరుకోగానే కొందరు సీనియర్‌ నాయకులు ఆయన్ని కలిసి కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియపై ఆరా తీశారట. నివేదికను ఎప్పుడు పార్టీ చీఫ్‌ సోనియా గాంధీకి ఇస్తున్నారు అని వాకబు చేశారట. సాగర్‌ ఉపఎన్నిక అయిన మూడు నాలుగు రోజులు తర్వాత మేడమ్‌కు నివేదిక ఇవ్వబోతున్నట్టు ఠాగూర్‌ తనను కలిసి ఆరా తీసిన వారికి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు సీరియస్‌గానే పీసీసీ చీఫ్‌ కుర్చీకోసం చూస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేను కూడా లైన్‌లో ఉన్నానని చెబుతున్నారు.

మొన్నటి వరకు రేస్‌లో వినిపించిన పేర్లలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పరిగణనలోకి తీసుకుంటారా లేక కొత్తగా ప్రయత్నిస్తున్న వారికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తుంది. ఇప్పటికి గట్టి ప్రయత్నాల్లో ఉన్న వారికి తోడు ఎమ్మెల్యే శ్రీధర్ బాబు,దామోదర రాజనర్సింహ,మధు యాష్కీ,బలరాంనాయక్ పేర్లు సైతం ప్రచారంలోకి వచ్చాయి. జానారెడ్డి సాగర్ లో నెగ్గితే మరో చర్చకు చాన్స్ లేకుండా జానాకే పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన అభిప్రాయ సేకరణను పక్కన పెట్టి.. మళ్లీ కొత్తగా సంప్రదింపుల చేస్తారా అన్న కోణంలో నాయకులు టెన్షన్ పడుతున్నారట.