రాప్తాడులో మళ్లీ టైట్ ఫైట్.. తగ్గేదే లేదంటున్న ప్రకాష్ రెడ్డి

-

అనంతపురం జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2024 ఎన్నికల్లో ఇక్కడ మరోసారి టఫ్ ఫైట్‌ జరిగేలా కనిపిస్తోంది. రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం కావడంతో మరోసారి రాష్ట్ర ప్రజలకు ఇది చర్చనీయ ప్రాంతంగా మారింది. పునర్విభజనలో భాగంగా 2009లో రాప్తాడు నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు ఈ ప్రాంతం పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండేది. విభజన తరువాత పరిటాల కుటుంబానికి అనుకూలంగా వుండే ప్రాంతాలు ఎక్కువగా ఇక్కడ ఉండటంతో వారు రాప్తాడుకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడ 2,45,435 మంది ఓటర్లు ఉన్నారు.

అనంతపురం నగరానికి అనుకుని ఉండే రాప్తాడు ఆ పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఆత్మకూరు, రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి.  అనంతపురం రూరల్లోని కొన్ని ప్రాంతాలు రాప్తాడు అసెంబ్లీ పరిధిలో ఉంటాయి. ఇప్పటివరకు ఇక్కడ మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లు తెలుగుదేశం, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేశారు. వచ్చే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠభరితంగా మారింది. రెడ్డి, బీసీ సామాజికవర్గం ఓటుబ్యాంకు అధిక సంఖ్యలో ఉంటుందీ ఈ నియోజకవర్గంలో. ఈసారి కూడా 2019 మాదిరిగానే పరిటాల వర్సెస్ తోపుదుర్తి మధ్యనే పోటీ నడవనుంది.

ఇక ఇక్కడ 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత రాప్తాడు నుంచి విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్లో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. హ్యాట్రిక్ కొట్టాలనే ఆమె కలను వైసీపీ అభ్యర్థి 2019లో అడ్డుకున్నారు. బలమైన పరిటాల కోటలో వైఎస్ఆర్సీపీ జెండా పాతారు ప్రకాశరెడ్డి. సునీతపై ఆయన 25 వేలకు పైగా మెజారిటీతో విజయఢంకా మోగించారు.ఈ సారి కూడా రాప్తాడు అభ్యర్థిగా పరిటాల సునీత పేరును ఖరారు చేసింది టీడీపీ అగ్రనాయకత్వం. చంద్రబాబు నాయుడు ఇటీవలే విడుదల చేసిన జాబితా సందర్భంగా సునీత పేరును ప్రకటించారు. మూడవ సిద్ధం సభను నభూతో అనే రీతిలో నిర్వహించి ఏపీలో చర్చకు దారితీసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే మరోసారి వైసీపీ తరపున పోటీ చేయడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ మళ్లీ వైసీపీ జెండా ఎగురబోతోందని సర్వేలు చెపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version