ఏపీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా, మూడు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన నేత నారా చంద్రబాబు నాయుడు. అతడు రాజకీయాల్లో తలపండిన నేత. తాను దేశంలోనే ఓ గొప్ప రాజకీయవేత్తనని, నాకున్న అనుభవం ఎవరికి లేదని తన బాజా తానే కొట్టుకోవడంలో దిట్ట. ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఓ సలహాదారును నియమించుకున్నారు. ఇది వినడానికి వింతగానే ఉన్నప్పటికి ఇది ముమ్మాటికి నిజం. చంద్రబాబు నాయుడేంటీ.. సలహాదారును నియమించుకోవడం ఏంటీ.. ఎందరో సలహాదారులను చూసిన చంద్రబాబు.. తానే ఏపీకి సీఈవో అంతటి వ్యక్తిని అని సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబుకు ఓ సలహాదారుడు నియమితులయ్యాడు.
అయితే ఓ గొప్ప రాజకీయ నేతగా డప్పుకొట్టుకునే చంద్రబాబుకు సలహాదారుడు రావడం, బాబును అధికారంలోకి తేవడమంటే అతడో ఘటికుడే అయి ఉండాలి. లేదా.. ఓ పేరుమోసిన నిపుణుడైనా అయి ఉండాలి అంటే.. అవుననే అంటున్నారు. పీకే మీకు గుర్తిండే ఉంటారు. ఆయన ఎవరో కాదు.. ఏపీ ప్రజలకు పీకేగా సుపరిచితుడైన ప్రశాంత్ కిషోర్. ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందే అనుకుంటున్నారా..? అవును ఇతడు ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సలహాదారుడిగా ఉన్న ఈ ప్రశాంత్ కిషోరే.
అయితే పీకే వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన రాబీన్ శర్మ అనే వ్యక్తిని చంద్రబాబు ఇప్పుడు సలహాదారుడిగా నియమించుకున్నాడట. అంతేకాదు రాబిన్ శర్మకు రూ.50కోట్లతో కాంట్రాక్టు కుదిర్చుకున్నట్లు వినికిడి.
పీకే రాజకీయ సర్వే సంస్థ ఐప్యాక్‌లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం రాబిన్ శర్మకు ఉంది. పీకే సంస్థ నుంచి వేరుపడి ఇప్పుడు సొంతంగా ఓ రాజకీయ సర్వే సంస్థను ఏర్పాటు చేసుకున్నాడట రాబీన్ శర్మ. చంద్రబాబు నాయుడులాంటి సీనియర్ రాజకీయ నాయకుడి వద్ద ఈ ఆర్ఎస్ సలహాలు పనిచేస్తాయా అనేది తేలాల్సి ఉంది.
తన గురువు పీకే వద్ద నేర్చుకున్న పాఠాలు బాబు వద్ద పనిచేస్తాయో లేదో వేచి చూడాల్సి ఉంది. 40ఏండ్ల రాజకీయ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు వద్ద కొత్తగా ఓ దుకాణం తెరిచిన ఆర్ ఎస్ సలహాలు ఇంపుగా ఉంటాయో.. ఈసడించుకునేలా ఉంటాయో చూడాలి. పీకే సలహాలతో వైఎస్ జగన్ సీఎం అయ్యాడు. మరి ఆర్ ఎస్ సలహాలతో చంద్రబాబు 2024లో అధికారంలోకి వస్తాడో లేక ఉన్న ప్రతిపక్ష పదవికి కూడా ఎసరు వస్తుందో వేచిచూడాల్సిందే… !