ప్ర‌జ‌ల్ని కూడా ప్ర‌యివేటు ప‌రం చేస్తున్నారు

-

భార‌త్ హెవీ ఎల‌క్ట్రిక‌ల్స్ లిమిటెడ్‌, సింగ‌రేణి బొగ్గు గ‌నులు, భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్‌, విశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం, కోల్ ఇండియా, ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌, నేష‌న‌ల్ థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్‌, ‌…. ఇలా ఒక‌టేమిటిలే.. ఎన్నో కంపెనీలు.. ఎంద‌రో అధికారులు.. మ‌రెంత‌మందో ఉద్యోగులు.. ఇంకెంద‌రో కార్మికులు… ఇలా ఉండేవంట భార‌త‌దేశ ప్ర‌భుత్వం త‌ర‌ఫున కంపెనీలు. ప్ర‌భుత్వమే ఎన్నో కంపెనీల‌ను న‌డిపేదంట‌.. త‌ర్వాత కాలంలో ప్ర‌యివేటీక‌ర‌ణ పేరుతో వీట‌న్నింటినీ అస్మ‌దీయుల‌కు క‌ట్ట‌బెట్టాల‌నే ఉద్దేశంతో, న‌ష్టాలున్నాయ‌నే సాకుతో వ‌దిలించుకున్నారంట‌… అని భ‌విష్య‌త్తులో విద్యార్థులు పాఠ్యాంశాలుగా చ‌దువు‌కోబోతున్నారు.

కూర్చొని తింటే కొండ‌లైనా క‌రిగిపోతాయి

నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వీనుల విందుగా ప్రయివేటీకరణ రాగం ఆలపిస్తోంది. ప్ర‌భుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతూ, మ‌ర‌న్నో కుటుంబాల‌కు ఉపాధి క‌ల్పించే కంపెనీల‌ను ప్ర‌యివేటుప‌రం చేయ‌డంవ‌ల్ల తాత్కాలికంగా వ‌చ్చినష్టమేదీ క‌న‌ప‌డ‌క‌పోయినా భవిష్యత్తులో సంభ‌వించ‌బోయే విప‌రిణామాల‌ను దృష్టిలో ఉంచుకోవ‌డంలేదు. కూర్చొని తింటే కొండ‌లైనా క‌రిగిపోతాయి… మ‌న పెద్ద‌లు చెప్పే మాట ఇది. రూపాయైనా, కంపెనీ అయినా చేతిలో ఉన్న‌ప్పుడు జాగ్ర‌త్త చేసుకోవ‌డం.. పొదుపు చేసుకోవ‌డం.. భ‌విష్య‌త్తుకు బాట వేసుకోవ‌డం అంద‌రూ ఇదే చేస్తారు. చేతిలో పెద్ద యంత్రాంగం ఉన్న‌ప్పుడు ప్ర‌భుత్వం ఇంకెంత చేయాలి?

నువ్వు హిందువు కాదా?

జీఎస్టీ ద్వారా కేంద్ర ప్ర‌భుత్వానికి నెల‌కు రూ. రూ.లక్ష కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సొమ్ములన్నీ ఏమవుతున్నాయో లెక్క‌లు లేవు. స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం అడిగినా ఇచ్చే లెక్క‌ల‌కు, చెప్పే మాటల‌కు పొంత‌న కుద‌ర‌డంలేదు. ఒకే దేశం.. ఒకే ప‌న్ను అంటూ హ‌డావిడి చేశారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుక‌న్నా దేశానికి ఎక్కువ న‌ష్టం జీఎస్టీవ‌ల్లే జ‌రిగింది. అనుకున్న లక్ష్యం చేరుకున్నారో లేదో తెలియదుకానీ ఆర్థికంగా దేశం మాత్రం కుదేలైంది. రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌యివేటీక‌ర‌ణ పేరుతో లక్ష‌ల కోట్ల‌రూపాయ‌ల దేశ సంప‌ద‌ను అస్మ‌దీయుల‌కు అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతున్న తీరు హృద‌యాల‌ను క‌ల‌చివేస్తోంది. ఇదేమిట‌ని అడుగుతుంటే నువ్వు హిందువుకాదా? అంటూ భార‌తీయ జ‌న‌తాపార్టీ నేత‌లు ఎదురు ప్ర‌శ్నిస్తున్నారు. నిల‌దీసి అడిగేవారిని దేశ‌ద్రోహులుగా చిత్రీక‌రిస్తున్న ఈ పాల‌కులు త్వ‌ర‌లోనే ప్ర‌జ‌ల్ని కూడా ప్ర‌యివేటుప‌రం చేయ‌డానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు… త‌స్మాత్‌.. జాగ్ర‌త్త‌!!!.

Read more RELATED
Recommended to you

Latest news