సేమ్ టు సేమ్‌.. నాడు నంద్యాల నేడు దుబ్బాక‌!

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి తీవ్ర ఉత్కంఠ‌.. అభ్య‌ర్థుల ఆశ‌ల మ‌ధ్య‌.. ఉప ఎన్నిక‌లు ముగిశాయి. దాదారు నెల రోజుల నుంచి ఇక్క‌డ రాజ‌కీయ పార్టీలు చేసిన హ‌ల్‌చ‌ల్ మంగ‌ళ‌వారం నాటి ప్ర‌శాంత పోలింగ్‌తో ఎట్ట‌కేల‌కు ముగిసింది. అయితే, ఈ ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎవ‌రెక్కుతారు? అధికార పార్టీ విజ‌యం సాధిస్తుందా?  లేక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీజేపీ గెలుపుగుర్రం ఎక్కుతుందా..? అనేది మ‌రో టెన్ష‌న్‌కు దారితీసినా.. ఎన్నిక‌ల స‌ర‌ళి.. పోలింగ్ విధానం.. వంటివి గ‌మ‌నిస్తే.. 2017లో ఏపీలో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల‌ను త‌ల‌పిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీంతో అప్ప‌టి ఉప పోరుకు.. దీనికి పోలిక పెడుతున్నారు.. ప‌రిశీల‌కులు.

2017లో ఏపీలోని క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఉప ఎన్నిక జ‌రిగింది. అప్ప‌ట్లో నంద్యాల శాస‌న‌స‌భ్యుడు.. భూమా నాగిరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో.. ఉప ఎన్నిక అనివార్య‌మైంది. వాస్త‌వానికి ఆయ‌న 2014లో వైసీపీ త‌ర‌పున గెలిచి.. త‌ర్వాత అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఈ సీటు మాదంటే.. మాద‌ని.. టీడీపీ.. వైసీపీలు పోరాడుకున్నాయి. ఫ‌లితంగా ఇరు ప‌క్షాలు కాంగ్రెస్ స‌హా అన్ని పార్టీలు బ‌రిలో నిలిచాయి. హోరా హోరీ పోరును త‌ల‌పించింది. ఇప్పుడు దుబ్బాక‌లో ఎలా అయితే.. ఒక మంత్రి తిష్ట‌వేసి.. ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించారో.. అప్ప‌ట్లో కాల్వ శ్రీనివాసులు.. స‌హా ఇద్ద‌రు ముగ్గురు మంత్రుల‌కు చంద్ర‌బాబు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అదేవిధంగా దుబ్బాక‌లో రాత్రికి రాత్రి ప్ర‌ధాన డ్రైన్లు, రోడ్లు ఎలా పూర్త‌య్యాయో.. అప్పట్లో నంద్యాల క‌ర్నూలు.. ప్ర‌ధాన ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌.. కాల్వ‌ల‌కు మ‌ర‌మ్మ‌తులు కూడా రాత్రికి రాత్రి పూర్త‌య్యాయి.

టీడీపీ త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత, అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నేరుగా ఇక్క‌డ ప్ర‌చారం చేయ‌క‌పోయినా.. ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే ఇక్క‌డ సర్వం నిర్వ‌హించారు. దుబ్బాక‌లోనూ ప్ర‌స్తుత సీఎం కేసీఆర్ ఫిజిక‌ల్‌గా ప్ర‌చారానికి దూరంగా ఉన్నప్ప‌టికీ.. నిముష నిముషానికి ఇక్క‌డ ఏం జ‌రుగుతోందో ఆయ‌న త‌న క‌నుస‌న్న‌ల్లో మానిట‌రింగ్ చేశారు. పోలీసుల దూకుడు అప్ప‌ట్లో నంద్యాల‌లో ఎలా కొన‌సాగిందో.. ఇప్పుడు దుబ్బాక‌లోనూ అంతే రేంజ్‌లో కొన‌సాగింది. పోలింగ్ విష‌యానికి వ‌స్తే.. రెండు విష‌యాలు చ‌ర్చించాలి. ఒక‌టి పోలింగ్ జ‌రిగిన తీరు. దుబ్బాక‌లో ప్ర‌శాంతంగా పోలింగ్ ముగిసింది. ఎక్క‌డా ఎలాంటి ఘ‌ర్ష‌ణ‌ల‌కు అవ‌కాశం లేదు. ఉద‌యం ఏడు నుంచి రాత్రి ఏడు త‌ర్వాత కూడా ప్ర‌జ‌లు క్యూల్లో ఉన్నారు.

నంద్యాల‌లో మాత్రం పోలింగ్‌కు ఓట‌ర్లు పోటెత్తినా.. అల‌జ‌డులు, ఘ‌ర్ష‌ణ‌లు, లాఠీ చార్జీల‌కు దారితీసింది. ఇక‌, పోలింగ్ శాతాల‌కు వ‌స్తే… నాడు నంద్యాల‌లో 87 శాతం రికార్డు స్థాయిలో ఓట్లు పోల‌య్యాయి. ఇప్పుడు దుబ్బాక‌లో సాయంత్రం ఆరు గంట‌ల‌కే 75 శాతం పోలింగ్ పూర్త‌యింది.. తుది ఫ‌లితం వ‌చ్చేస‌రికి ఇక్క‌డ కూడా 80 శాతం ఓటింగ్ అంచ‌నా ఉంది. ఇక‌, ఫ‌లితం విష‌యానికి వ‌స్తే.. ఇంత భారీ రేంజ్‌లో పోలింగ్ జ‌రిగింది కాబ‌ట్టి.. అధికార పార్టీకి వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌తిప‌క్షం, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు ఫిదా అయ్యార‌ని అధికార ప‌క్షం నంద్యాల విష‌యంలో ప్ర‌చారం చేసుకున్నాయి. చివ‌రికి అధికార ప‌క్షానిదే విజ‌యం అయింది. దుబ్బాక విష‌యంలో మాత్రం పైవిధంగానే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నా.. ఫ‌లితం మాత్రం ఉత్కంఠ‌కు గురి చేస్తోంది. మ‌రో వారం రోజుల త‌ర్వాత అంటే.. ఈ నెల 10 న ఫ‌లితం వెలువడే వ‌ర‌కు బీజేపీ, టీఆర్ ఎస్ ల మ‌ధ్య న‌రాలు తెగే ఉత్కంఠ తొల‌గిపోయే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.