నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్ స్వీకరించారు. అంతకు ముందు గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. పెరిగిన వ్యవసాయ ఉత్పత్తులు ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రైతులకు మరో లక్ష రూపాయలు రుణమాఫీ చేయబోతున్నామని సీఎం స్పష్టం చేశారు.
రైతు బంధు పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కేంద్ర పథకానికి రైతు బంధు పథకమే ప్రేరణ. ప్రపంచంలోనే గొప్ప పథకంగా రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది. రైతు బీమా కింద రైతు మరణిస్తే 5 లక్షలు అందిస్తున్నాం. రైతు బీమా పథకానికి ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోందని సీఎం తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం
పర్యావరణ పరిరక్షణ కోసమే హరితహారం ప్రవేశపెట్టామని సీఎం స్పష్టం చేశారు. జీవనం దుర్భరమైతే సంపద, పరిజ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. సస్యశ్యామల సమశీల తెలంగాణను ఆవిష్కరించుకోవాలని సీఎం అన్నారు.
స్థానిక సంస్థల పనితీరు మెరుగుకు పంచాయతీరాజ్ చట్టం తెచ్చాం. స్థానిక సంస్థలకు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు వస్తాయి. గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. పాలనలో జవాబుదారీతనం కోసం పురపాలిక చట్టాన్ని తెస్తున్నాం. వసూలు చేసే పనులు పోయినా రెవెన్యూ శాఖ పేరు పోలేదు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. కొత్త రెవెన్యూ చట్టం అమలులో ప్రజలు భాగస్వాములు కావాలి. అవినీతిని పారద్రోలితే.. పాలన వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు.