విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏపీలో రాజకీయ వేడిని రాజేస్తోంది.సంఖ్యాబలం పరంగా ఏకపక్ష విజయం అనుకుంటున్న వైసీపీకి షాక్ తగిలింది. వైజాగ్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో బలమే లేని కూటమి గెలిచినా జగన్ వెనకడుగు వేయడం లేదు. ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని కూటమికి షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. విజయవాడ, కర్నూలు నగరపాలక సంస్థల స్థాయి సంఘ కమిటీల ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది.
అక్కడ మంత్రులు రంగంలోకి దిగినా వైసీపీ విజయభేరి మోగించింది. కానీ విశాఖకు వచ్చేసరికి మాత్రం కూటమి నెగ్గింది. పదికి పది స్థానాలను కూటమి గెలుచుకోవడంతో రాజకీయాలు వేడెక్కాయి.ఒక వ్యూహం ప్రకారం పావులు కదిపి పెద్ద ఎత్తున వైసిపి కార్పొరేటర్ లను టిడిపి, జనసేనలో చేర్చుకుంది. దీంతో కూటమి తరుపున నిలబడిన పదిమంది టిడిపి అభ్యర్థులు అన్ని స్థానాలను గెలుచుకున్నారు. ఈ విజయంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కి సంబంధించి ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.
వైజాగ్ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురైనా జగన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజా ఓటమితో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తున్నా వారిని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తున్నారు జగన్. నిరాశకు లోనవకుండా ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని సమీక్షల్లో నేతలకు సూచిస్తున్నారు.ఎప్పటికప్పుడు వై వి సుబ్బారెడ్డితో సమన్వయం చేసుకుంటూ వైసీపీ ఓటర్లకు టచ్‌లో ఉంటున్నారు.
ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎలాగైనా విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకే స్థానిక సంస్థల ప్రజాప్రతినిథులకు గాలం వేసి తాయిళాల ఆశ చూపి లాగేసుకుటోంది. వైసీపీ దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు,పవన్‌కళ్యాణ్ తెరచాటు రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారబలంతో వైసీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం అవసరమైతే క్యాంప్ రాజకీయాలు చేసేందుకు కూడా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలో పాల్గొనే ఓటర్లను బెంగళూరుకు తరలించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. .
విశాఖపట్నం జిల్లా వైసీపీకి కలిసిరావడం లేదనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ ప్రభంజనం వీచినా … విశాఖ నగర పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రం టీడీపీ వశమయ్యాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలోనూ ఓటమే ఎదురైంది. విశాఖ అంటేనే వైసీపీలో ఒక రకమైన భయం కనిపిస్తున్నా ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు విశాఖ స్థాయీ సంఘ ఎన్నికల్లో సైతం ఓటమి పలకరించగా శ్రేణులు నిరాశకు లోనుకాకుండా జగన్ పోటీతత్వాన్ని నూరిపోస్తున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న ప్రచారం ప్రారంభమైనా దీనిని వైసీపీ బలంగా ఖండిస్తోంది. బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేత రాజకీయ అనుభవం, జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో విశాఖ ఎమ్మెల్సీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లను ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా విజయాన్ని అడ్డుకోలేరుని కూటమికి గట్టి సవాల్ విసురుతున్నారు.మరి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి.