మాజీ రాష్ట్రప్రతి ప్రణభ్ ముఖర్జీ మృతి దేశానికి తీరనటి లోటు. నాలుగైదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అధిరోహించిన ప్రణబ్ కేంద్ర మంత్రిగా పని చేయడంతో పాటు భారత రాష్ట్రపతిగా కూడా ఉన్నారు. ఇక ఆయనకు భారతరత్న అవార్డు కూడా లభించింది. దాదా అని అందరూ ముద్దుగా పిలుచుకునే ప్రణబ్ కేవలం 34 సంవత్సరాల వయస్సులోనే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇందిరాగాంధీ ప్రణబ్‌ను స్వయంగా రాజ్యసభకు పంపడంతో పాటు ఆయన్ను కేబినెట్లోకి తీసుకున్నారు.
అంతకు ముందు ఆయన పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ఇక 2004లో ఆయన తొలిసారి లోక్‌సభకు ఎంపికయ్యారు. ఇక ప్రణబ్‌కు దక్షిణాది రాష్ట్రాలు, ఇక్కడ నేతలతోనూ అనుబంధం ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో ఎంతో మంది నాటి కాంగ్రెస్ నాయకులతో ఆయనకు పరిచయం ఉంది. ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో ఓ వైసీపీ నేతకు సీటు ఇవ్వాలని ప్రణబ్ నేటి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి నేరుగా రికమెండ్ చేసినట్టు టాక్ ఉంది.
ఆ నేత ఎవరో కాదు నేటి ఏపీ డిప్యూటీ స్పీకర్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి. రఘుపతి తండ్రి దివంగత కోన ప్రభాకర్‌రావు సీనియర్ కాంగ్రెస్ నేత. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పనిచేశారు. 2009 ఎన్నికల్లో నాడు రఘుపతి కాంగ్రెస్ సీటు కోసం ట్రై చేసినా రాకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఇక ప్రభాకర్‌రావుకు ప్రణబ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాడు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ అపాయింట్‌మెంట్ రావడంలోనూ, ప్రణబ్, జగన్‌కు మధ్య మంచి బాండింగ్ ఏర్పడేలా చేయడంలోనూ రఘుపతిది కీలక పాత్ర అని చెపుతారు.
ఇక 2009లో ప్రణబ్ రికమెండేషన్‌తో సీటు దక్కించుకుని గెలిచిన కోన మొన్న ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఆ మాటకు వస్తే వైఎస్‌కు ప్రణభ్‌కు కూడా మంచి సంబంధాలే ఉండేవి. వైఎస్‌పై ఆయన ఎంతో ప్రేమతో ఉండేవారని చెపుతారు. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లోనూ అప్పట్లో జగన్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించినా కూడా ప్రణబ్‌కు సపోర్ట్ చేశారు.