నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..! : రాహుల్ గాంధీ

-

దేశంలో నిత్యం పెరిగిపోతోన్న నిరుద్యోగం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. మోదీ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలంటే 1942లో చేపట్టిన ‘విజయమో.. వీరస్వర్గమో’ వంటి నినాదానికి మరోసారి పిలుపునివ్వాల్సిన అవసరం ఉందన్నారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగంతోపాటు నియంతృత్వాన్ని దేశం నుంచి తరిమికొట్టాలని  రాహుల్‌ గాంధీ ఉద్ఘాటించారు. ఆంగ్లేయులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన క్విట్‌ ఇండియా ఉద్యమం మొదలైన రోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ.. మోదీ  ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

‘ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆగస్టు 9, 1942లో ముంబయిలో క్విట్‌ ఇండియా ఉద్యమానికి మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. గాంధీజీ పిలుపు మేరకు ఆ సాయంత్రం ముంబయిలోని గోవాలియా ట్యాంక్‌ మైదానానికి కాంగ్రెస్‌ నేతలు, ప్రజలు చేరుకున్నారు. ఈ సమయంలో ‘విజయమో.. వీర స్వర్గమో’ (డు ఆర్‌ డై) అంటూ గాంధీజీ ఇచ్చిన పిలుపు ఆంగ్లేయులకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఆ ఉద్యమంలో 940 మంది పౌరులు అమరులు కాగా వేల మంది జైలుపాలయ్యారు’ అంటూ క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని రాహుల్‌ గాంధీ గుర్తుచేశారు. అటువంటి ఉద్యమమే నేడు మరోసారి అవసరం అయ్యిందన్న ఆయన.. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దేశాన్ని రక్షించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు.

ఇదిలాఉంటే, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను ప్రస్తుత ప్రభుత్వం జైళ్లలో పెడుతోందంటూ రాహుల్‌ గాంధీ ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇలా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఎవరిపైనైనా ప్రభుత్వం దాడులకు దిగుతోందంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇటువంటి నియంతృత్వ తరిమికొట్టేందుకు క్విట్‌ ఇండియా తరహా మరో ఉద్యమం అవసరమని రాహుల్‌ గాంధీ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version