రజనీకాంత్ మరో అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా ?

-

రాజకీయ పార్టీ పెట్టడం లేదని ప్రకటించిన రజనీకాంత్.. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది తేలాల్సి ఉంది. ప్రజాసేవ కొనసాగిస్తానంటున్న తలైవా.. అందుకు ఏ మార్గం ఎంచుకుంటారనేది ఆసక్తి రేపుతోంది. కుటుంబ సభ్యుల మాటకు కట్టుబడే ఉంటారా.. మళ్లీ అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా అనే విషయంపై ఇప్పుడు తమిళనాట ఆసక్తికర చర్చ జరుగుతోంది.


రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తమిళనాడులో రజనీకాంత్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. గతంలో రజనీ మాట మీద పార్టీలు అధికారంలోకి వచ్చిన చరిత్ర కూడా అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా రజనీ అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వాళ్లందరికీ రజనీ ఎలాంటి ఆదేశాలు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. పైకి చెప్పకపోయినా.. లోపాయికారీగా ఫలానా పార్టీకి మద్దతుగా ఓటేయాలని రజనీ సూచిస్తే మాత్రం.. కచ్చితంగా పార్టీల విజయావకాశాలు ప్రభావితమౌతాయి. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో రజనీ కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తలైవా భవిష్యత్ కార్యాచరణ ఏంటనే ఆసక్తి మాత్రం అందరిలో ఉంది.

రజనీకాంత్ పార్టీ పెడతానని హఠాత్తుగా నిర్ణయం తీసుకోలేదు. మూడేళ్ల పాటు టైమ్ తీసుకున్నారు. కావల్సినన్ని సంప్రదింపులు జరిపారు. రజనీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికెళ్లేటప్పుడు కూడా పార్టీ ప్రకటన కచ్చితంగా ఉంటుందని.. ఆయన సోదరుడు ప్రకటించారు. అయినా సరే చివరకు తలైవా మనసు మార్చుకున్నారు. అభిమానులతో సమావేశాలు పెడుతున్నప్పుడు, పార్టీ ప్రకటన ఫలానా తేదీన చేస్తానని చెప్పినప్పుడు అభ్యంతరం చెప్పని కుటుంబం సభ్యులు.. ఇప్పుడు అడ్డుచెప్పడం కూడా చర్చనీయాంశంగా మారింది. రజనీ అనారోగ్యం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించినప్పట్నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పటివరకూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై స్పందించలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి కూతుళ్ల ఒత్తిడితో రజనీ నిర్ణయం తీసుకున్నారన్న వార్తలపై అభిమానుల్లో విస్మయం వ్యక్తమౌతోంది.

రాజకీయాల్లోకి రాకపోయినా ప్రజాసేవ కొనసాగుతుందన్న రజనీ ప్రకటనలో ఉన్న అంతరార్థమేంటా అని రాజకీయ వర్గాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ప్రజాసేవ కోసం ఏదైనా సంస్థ స్థాపిస్తారా.. లేకపోతే సేవ పేరుతో రాష్ట్రమంతా పర్యటిస్తారా.. ఇలా ఎన్నో సందేహాలున్నాయి. కానీ దీనిలో ఏ విషయంపైనా ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదు. రజనీ ప్రజాసేవ ఏ రూపంలో చేస్తారనే విషయం తేలేవరకు రకరాకల ఊహాగానాలు వస్తూనే ఉంటాయి. దీని సంగతి పక్కనపెడితే.. వచ్చే ఎన్నికల్లో రజనీ పోషించబోయే పాత్ర ఎలా ఉంటుందనేది కూడా చర్చనీయాంశమే. పక్కనున్నవాళ్ల మాటలకు తీవ్రంగా ప్రభావితం అయ్యే రజనీకాంత్.. పార్టీ పెట్టేది లేదన్న ప్రకటనకు ఎంతవరకు కట్టుబడి ఉంటారనే అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.

రజనీ వయసు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా.. ఈసారి నిర్ణయం మారే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అయితే రజనీ మక్కల్ మాండ్రం మూడేళ్లుగా చేస్తున్న కష్టం వృథా పోదని, భవిష్యత్తులో పనికొస్తుందని తలైవా చెప్పిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. రజనీ మక్కల్ మాండ్రం చేసిన పనికీ.. రజనీ భవిష్యత్ కార్యాచరణకు ఏమైనా లింక్ ఉంటుందా అనే కోణంలో చర్చ జరుగుతోంది. రజనీ మక్కల్ మాండ్రం గత మూడేళ్లలో రజనీ అభిమాన సంఘాలు సంఘటితమయ్యాయి. తలైవా పార్టీ స్థాపిస్తారనే ఉద్దేశంతో కొంత గ్రౌండ్ వర్క్ కూడా చేశారనే వాదన ఉంది.

రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడం తనకు నిరాశ కలిగించిందని మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ అన్నారు. అయితే రజనీ ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమని కూడా వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా రజనీ స్థాయి వ్యక్తి రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించి.. అనూహ్యంగా వెనక్కితగ్గడం అవమానమేనని ఆయన అభిమానులు ఫీలయ్యే అవకాశం ఉంది. అయితే ఇదంతా కొన్నాళ్లేనని, ఆ తర్వాత అభిమానులు అన్నీ మర్చిపోతారనే వాదనా ఉంది. అభిమానుల సంగతి పక్కనపెడితే.. రజనీ ఏం ఆలోచిస్తున్నారనేది కూడా కీలకంగా మారింది. అసలు పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే.. మూడేళ్ల పాటు సుదీర్ఘ మంతనాలు జరపాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

కనీసం ప్రజాసేవ ఏ రూపంలో చేయాలనే విషయంలో అయినా రజనీకాంత్ కు క్లారిటీ ఉందా.. లేకపోతే ఏదో ప్రకటన చేయాలి కాబట్టి చేశారా అనే సెటైర్లూ వస్తున్నాయి. రజనీ ఊగిసలాట మనస్తత్వం కారణంగా ఆయన చర్యలన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయని విమర్శకులు అంటున్నారు. రజనీ పార్టీ పెట్టకపోవడం వెనుక ఏ శక్తీ లేదని.. ఆయనకు ఇష్టం లేకపోయినా పార్టీ పెడతానని ప్రకటన చేయించడానికే.. అదృశ్య శక్తులు బలంగా పనిచేశాయనే వాదన కూడా ఉంది. 70 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలు.. రాజకీయాల్లో సక్సెస్ కాకపోతే దూరమౌతాయనే అనుమానం కూడా తలైవాను పట్టి పీడించి ఉండొచ్చని భావిస్తున్నారు. మళ్లీ రజనీకాంత్ నోరు విప్పితే కానీ.. ఆయన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news