ఇప్పుడు తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా జలాల వివాదం నడుస్తోంది. మొన్నటి వరకు రెండు రాష్ట్రాల సీఎంలు ప్రతి విషయంలో కలిసి నడిచారు. ఎన్నో విషయాలపై, వివాదాలపై సానుకూలంగా మాట్లాడుకుని పరిష్కరించుకున్నారు. కానీ అనూహ్యంగా ఏపీ ప్రభుత్వ కృష్ణా నదిపై కడుతున్న ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం విరుచుకుపడుతోంది.
ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం వీటిపై న్యాయపోరాటానికి రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే మంత్రి ప్రశాంత్‌రెడ్డి రంగంలోకి దిగి అగ్గిని రాజేస్తున్నారు. జగన్‌ను ఏకంగా గజదొంగ అంటూ నీళ్ల దొంగ అంటూ విమర్శిస్తున్నారు. దీంతో అటు ఏపీ ఇటు తెలంగాణ మధ్య మళ్లీ వివాదం రాజుకున్నట్టు అయింది. అయితే ఇందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
అప్పట్లో కేసీఆరే కృష్ణానీళ్లను ఏపీ వాడుకోవచ్చిన జగన్‌కు తామే పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఏకంగా కొత్త ప్రాజెక్టులకు నాంది పలికింది. ఇవి పూర్తయితే తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు నీటి కటకట తప్పదు. ఇక అంతదూరం వస్తే కేసీఆరే పర్మిషన్ ఇచ్చారని ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయి. ఈ కారణాలతో కేసీఆర్ అప్రమత్తమయి తాను వ్యతిరేకమని చెప్పకుండా మంత్రి ప్రశాంత్‌రెడ్డితో రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో చూడాలి.