కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై జరిగిన దాడిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఇలాంటి చర్యలకు పూనుకున్న వారిని కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టరని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కన్నెర్ర చేస్తే ఎవరూ బయట తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
రాజకీయంగా నష్టపోయినా.. కాంగ్రెస్ ఎప్పుడూ బాధపడలేదని రేవంత్‌రెడ్డి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చామని సంతృప్తిపడిందన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఓటు వేయకపోయినా బాధపడలేదని తెలిపారు. రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా రాజకీయంగా కాంగ్రెస్ నష్టపోయిందన్నారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలు చూసి ప్రజలు కేసీఆర్‌ను రెండుసార్లు సీఎంను చేశారని రేవంత్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారని రేవంత్ మండిపడ్డారు. ఉద్యోగాలు, రెండుపడక గదుల ఇళ్లు, ఎస్సీలకు మూడెకరాలు వంటి హామీలతో మోసం చేశారని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు ఇస్తారనుకుంటే గొర్లు, బర్లు, చేపలు పెంచుకోవాలని చెప్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.