భారీ వర్షాల అనంతరం కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వరదల తాలూకు నష్టం నుంచి బయట పడేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులుగా మారిన కొన్ని లక్షల మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా కేరళలో కురిసిన భారీ వర్షాలకు సంభవించిన మొత్తం నష్టం విలువ రూ.21వేల కోట్ల వరకు ఉంటుందని కేరళ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,600 కోట్ల తక్షణ సహాయాన్ని కోరగా కేంద్రం రూ.600 కోట్లను మంజూరు చేసింది.
కేరళ వరద బాధితులకు సహాయం అందించేందుకు గాను యూఏఈ ప్రభుత్వం రూ.700 కోట్లను మంజూరు చేసిందని, కానీ దాన్ని కేంద్రం తిరస్కరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై కేరళ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. అయితే న్యూఢిల్లీలో ఉన్న యూఏఈ ఎంబస్సీ అధికారులు మాత్రం కేరళకు యూఏఈ ఎలాంటి సహాయాన్ని ప్రకటించలేదని, అవి పుకార్లేనని తేల్చారు. దీంతో ఇప్పుడీ విషయం చర్చనీయాంశమవుతోంది.
భారీ వర్షాల కారణంగా కేరళలో 10వేల కిలోమీటర్ల రోడ్లు నాశనమయ్యాయి. ఇక 20వేల నుంచి 50వేల ఇండ్లకు పగుళ్లు రావడంతో వాటికి మరమ్మత్తులు చేయాల్సి ఉంది. ఇక 13 లక్షల మంది ప్రజలు 3,300 పునరావాస కేంద్రాల్లో తలదాచుకోగా వారంతా ఇప్పుడిప్పుడే తమ ఇండ్లకు వెనుదిరుగుతున్నారు. ఇక చాలా మంది ఇళ్లయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో వర్షాల కారణంగా కేరళలో జరిగిన పూర్తి నష్టాన్ని అధిగమించేందుకు చాలా సమయమే పట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.