తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిష్కరణతో ఆసక్తి రేపిన వైయస్ షర్మిల, తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. వైయస్సార్టీపీ పేరుతో పార్టీ ఆవిర్భావం ఘనంగా జరిగింది. ఆంధ్రలో జన్మించినప్పటికీ తెలంగాణ కోడలినని చెప్పుకుంటున్న షర్మిల, తెలంగాణ ప్రజల కోసం ఏమైనా చేస్తానని వెల్లడించింది. ప్రస్తుతం షర్మిల నిరుద్యోగ దీక్ష మొదలుపెట్టింది. గత కొన్ని రోజులుగా తెలంగాణ అంతటా నిరుద్యోగులను కలుసుకుంటూ దీక్ష నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ దీక్ష నిజామాబాద్ జిల్లాకు చేరుకుంది. డిచ్ పల్లి గ్రామంలో వైయస్సార్టీపీ అధినేత షర్మిల, నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు. ఐతే ఈరోజు మొదలు కావాల్సిన ఈ దీక్ష వాయిదా పడింది. గులాబ్ తుఫాన్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిచ్ పల్లిలో జరగాల్సిన నిరుద్యోగ దీక్ష వాయిదా పడింది. అక్టోబర్ 5వ తేదీన దీక్ష చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో నిరుద్యోగం పెరిగిందని, దానికి కారణం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారేనని షర్మిల విమర్శలు చేస్తున్నారు.