కరోనా వైరస్ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు కావల్సిన నిత్యావసర వస్తువులను ఇక వారి ఇళ్లకే డెలివరీ చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, పౌర సరఫరాల శాఖ మంత్రి దుష్యంత్ చౌతాలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గోధుమలు, బియ్యం, పప్పులు, నూనెలు తదితర నిత్యావసర వస్తువులను ఇకపై సివిల్ సప్లైస్ అధికారులు, సిబ్బందే ప్రజల ఇండ్లకు డెలివరీ చేయాల్సి ఉంటుంది.
ఇక హర్యానా ప్రభుత్వం ఇప్పటికే హ్యాండ్ శానిటైజర్లు, గ్లోవ్స్, హ్యాండ్ వాష్ తదితర వస్తువులతో కలిపి మొత్తం 22 వస్తువులను నిత్యావసరాల జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో వ్యాపారులు ఈ వస్తువులను ఎంఆర్పీ ధరలకే విక్రయించాల్సి ఉంటుంది. ధర ఎక్కువ చేసి అమ్మితే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హర్యానా ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక హర్యానాలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) ద్వారా అధికారులు నిత్యావసరాలను ప్రజల ఇండ్లకే డెలివరీ చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాలని చెబుతున్నా.. కొందరు వినకపోవడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది..!