తిరుపతి ఉపఎన్నిక వేళ హోదా పై రంగులు మారుతున్న రాజకీయం

-

నామినేషన్ల ఘట్టం ముగిసి ప్రచారం ఊపందుకోవడంతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో గెలుపెవరిది అన్న ఉత్కంఠ మొదలైంది. వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. గతంలో ఇదే ప్రాంతంలో మోడీ చేసిన ప్రకటన చుట్టూనే ఇప్పుడు పార్టీలు దృష్టి పెట్టాయి. ఉపఎన్నిక వేళ ప్రత్యేకహోదా ప్రచార అంశం కానుందా అన్న చర్చ మొదలైంది. ఒక వేళ ఇదే అస్త్రన్ని వైసీపీ,టీడీపీ బలంగా వాడితే బీజేపీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

తిరుపతి అభివృద్ధి అంతా తమదే అంటుంది బీజేపీ. ఏపీకి కాబోయే అధినేత పవన్‌ కల్యాణ్‌ అని జనసైనికులు జారిపోకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక అధికార పార్టీ వైసీపీగెలుపు ఎప్పుడో ఖాయమైందని.. తమ దృష్టి అంతా మెజారిటీపైనే ఉందని స్పష్టం చేస్తోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కేంద్ర మాజీ మంత్రి పనబాకకు మళ్లీ టికెట్‌ ఇచ్చి బరిలో దిగింది టీడీపీ. అన్ని పార్టీలు ఇప్పుడు ప్రచారంపై ఫోకస్‌ పెట్టాయి. దుబ్బాక, గ్రేటర్ఎన్నికల మాదిరి ఇక్కడా సత్తా చాటుతామన్న ప్రకటనలతో ముందుకెళ్తున్నారు బీజేపీ నాయకులు.

ఇంత వరకు బాగానే ఉన్నా ఇప్పటి వరకు అభివృద్ధి, సంక్షేమం అనే మాటల చుట్టూ తిరిగిన పార్టీల ప్రచారం మెల్లగా ప్రత్యేక హోదా దగ్గరకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో లెఫ్ట్‌ పార్టీలు హోదా అంశాన్ని ప్రస్తావించి మొదటి బ్యాటింగ్‌ మొదలుపెట్టాయి. 2014 ఎన్నికల్లో తిరుపతి సభలో ప్రత్యేక హోద అంశాన్ని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఇప్పుడు అదే తిరుపతిలో ఉపఎన్నిక కావడంతో ఈ అంశాన్ని ఇతర పక్షాలు స్పీడ్‌గా క్యాచ్‌ చేస్తున్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టలేదని అధికార వైసీపీ నేతలు కూడా శృతి కలిపారు.

అయితే ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని తర్వాత ప్రత్యేక హోదా అంటూ గళమెత్తిన టీడీపీ ఈ విషయాన్ని ఏ విధంగా ప్రచారంలోకి తీసుకొస్తుందన్నదే ప్రశ్న. ప్రత్యేకహోదా ఎన్నికల్లో సీరియస్‌ టాపిక్‌ అయితే బరిలో ఉన్న రాజకీయ పార్టీలు విడిచిపెట్టే అవకాశం లేదు. అలాంటి సందర్భం వస్తే బీజేపీకి ఇబ్బందులు తప్పవు. సమాధానం చెప్పుకోవాల్సిన స్థితి బీజేపీకి రావొచ్చు. ప్రస్తుతానికి లెఫ్ట్‌ పార్టీలు తప్ప ఇంకెవరూ హోదా గురించి పెద్దగా ప్రశ్నలు వేయడం లేదు. చివరకు వైసీపీ, టీడీపీలు సైతం ప్రధాని మోడీ పేరును ప్రస్తావించడం లేదు. ఇది కొంత వరకు బీజేపీకి ఊరటనిచ్చే విషయం. ఇంకా ఏప్రిల్‌ 15 వరకు ఎన్నికల ప్రచారం గడువుండటంతో అప్పటిలోగా రాజకీయం ఏ విధంగా రంగులు మారుతుందో అంచనా వేయలేం.

Read more RELATED
Recommended to you

Exit mobile version