దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేస్తుండటంతో అజింక్య రహానేపై వేటు పడింది. జట్టులో మాత్రం చోటు కల్పించింది. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సత్తా చాటకపోతే రహానే టెస్టు జట్టులో కూడా స్థానం కోల్పోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
గత రెండేండ్లుగా టెస్టులో అజింక్య రహానే పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఆస్ట్రేలియా మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ మినహా పెద్ద పరుగులు చేసిన దాఖలాలు లేవు. 2021 సీజన్‌లో 12 టెస్టులు ఆడిన రహానే కేవలం బ్యాటింగ్ అవరేజ్ 20శాతం కలిగి ఉన్నాడు. ఈ కారణంగా సౌతాఫ్రికా టెస్టు జట్టులో స్థానం దక్కదని అందరూ భావించారు. కానీ, అతడికి ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడానికి ముందు రహానే మరో ఛాన్స్ ఇవ్వాలని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ భావించడంతో మరో అవకాశం దక్కింది. మెరుగైన ప్రదర్శన చేయకపోతే దక్షిణాఫ్రికా సిరీసే అతడికి చివరి అవకాశం కావచ్చు.
జట్టులో ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ కూడా పెద్ద పరుగులు చేయడం లేదు. ఈ సమయంలో రహానేపైనే వేటు వేయడం సబబు కాదని సెలెక్షన్ కమిటీ భావించినట్లు తెలుస్తున్నది. శుభ్‌మన్ గిల్ కాలి గాయం తిరగబెట్టడం కూడా మరో కారణంగా తెలుస్తున్నది. అందుకే రహానేకు మరో అవకాశం దక్కింది. కానీ, మెరుగైన ప్రదర్శన చేయకపోతే పుజారా, అజింక్యలకు ఇదే చివరి సిరీస్ అయ్యే అవకాశం ఉన్నది.
మరోవైపు దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా ప్రారంభం కానున్నది. తుది జట్టులో అజింక్య రాహానే ఉంటాడన్న గ్యారెంటీ లేదు. వైస్ కెప్టెన్‌గా తుది జట్టులో స్థానం ఖాయం కానప్పుడు ఆ హోదాలో అతడు కొనసాగడం సమంజసం కాదని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అతడికి ప్రత్యామ్నయం శుభ్‌మన్ గిల్‌గా భావిస్తున్నట్లు తెలుస్తున్నది.