యూఎస్ ఓపెన్‌లో అనూహ్యంగా టైటిల్ బరిలో నిలిచి హోరాహోరీగా తలపడ్డారు ఇద్దరు యువ క్రీడాకారులు. ఇద్దరికీ ఇదే తొలి యూఎస్ ఓపెన్ ఫైనల్. అయినా ఒత్తిడిని చిత్తుచేస్తూ నువ్వానేనా అన్నట్లు పోటీ పడ్డారు. అయితే చివరికి విజయం స్పెయిన్ యువ సంచలనం, 19 ఏళ్ల కుర్రాడు అల్కరాజ్నే వరించింది. దాదాపు మూడున్నర గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో 6-4, 2-6, 7-6(7-1), 6-3 తేడాతో గెలుపొందాడు.
అంతేకాకుండా అల్కరాజ్ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. స్పెయిన్‌కే చెందిన దిగ్గజ ఆటగాడు రఫేల్ నాదల్ 2005లో అతిపిన్న (19 ఏళ్లు) వయసు ఆటగాడిగా తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాడు. అప్పటి నుంచి ఆ రికార్డును ఎవరూ బద్దలుకొట్టలేదు. తాజాగా అల్కరాజ్ ఆ రికార్డును సమం చేయడంతో పాటు 19 ఏళ్ల వయసులోనే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తొలి ఆటగాడిగా అల్కరాజ్ నిలిచాడు.