ఐపీఎల్‌ 2021కు గుడ్‌ బై చెప్పనున్న ఆసీస్‌ ప్లేయర్లు..? కోవిడ్‌ భయమే కారణం..

దేశంలో రోజు రోజుకీ కోవిడ్‌ ప్రభావం ఎక్కువవుతున్న విషయం విదితమే. దేశంలో రోజూ 3 లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లు ఇప్పటికే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ నుంచి తప్పుకుని సొంత దేశానికి పయనమయ్యారు. క్రికెటర్లు కేన్‌ రిచర్డ్సన్‌, ఆండ్రూ టై, ఆడమ్‌ జంపాలు తమ సొంత దేశానికి వెళ్లిపోయారు. ఆండ్రూ టై అయితే ఐపీఎల్‌ ఫ్రాంచైజీలను బహిరంగంగానే విమర్శించారు. భారత్‌లో ఓ వైపు కరోనా వేగంగా వ్యాప్తి చెందుతూ అన్ని లక్షల కేసులు నమోదవుతుంటే ఫ్రాంచైజీలకు ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిర్వహించేందుకు మనస్సెలా వచ్చిందని అన్నాడు. అయితే ఇప్పుడు వారే కాదు, ఐపీఎల్‌లో ఆడుతున్న మిగిలిన ఆస్ట్రేలియన్‌ ప్లేయర్లు కూడా టోర్నమెంట్‌ నుంచి తప్పుకుని వెళ్లిపోవాలని చూస్తున్నట్లు తెలిసింది.

australian cricketers and staff might say good bye to ipl 2021

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, ఢిల్లీకి ఆడుతున్న స్టీవ్‌ స్మిత్‌, కోల్‌కతాకు ఆడుతున్న ప్యాట్‌ కమ్మిన్స్‌ సహా ఆస్ట్రేలియా క్రికెటర్లు, కామెంటేటర్లు, సహాయక సిబ్బంది అందరూ టోర్నీ నుంచి తప్పుకుని తమ దేశానికి వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అందుకనే వారు తమకు ఓ ప్రత్యేక చార్టర్డ్‌ విమానాన్ని ఏర్పాటు చేసేలా ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని కోరాలని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

అయితే ప్రస్తుతం క్రికెట్‌ ఆస్ట్రేలియా అన్ని ఆప్షన్లను పరిశీలిస్తుందని, ఇంకొన్ని రోజులు వేచి చూశాక నిర్ణయం తీసుకుంటుందని తెలిసింది. కొద్ది రోజులు పోయాక పరిస్థితులు మెరుగు పడితే ఓకే, లేదంటే అందరినీ తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. అయితే అదే జరిగితే ఐపీఎల్‌కు గట్టి దెబ్బ పడుతుందని చెప్పవచ్చు.