ఐపీఎల్ 2021 రెండో ద‌శ‌.. 30,000 ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయ‌నున్న బీసీసీఐ..

ఐపీఎల్ 2021 రెండో ద‌శకు బీసీసీఐ స‌ర్వం సిద్ధం చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లు టీమ్ ల‌కు చెందిన ఆట‌గాళ్లు, సిబ్బంది దుబాయ్‌కు చేరుకున్నారు. అయితే ఈ సీజ‌న్ మొద‌టి ద‌శ ఏప్రిల్‌, మే లోనే జ‌ర‌గాల్సి ఉండ‌గా కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డింది. దీంతో రెండో ద‌శ‌లో అలాంటి పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా బీసీసీఐ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. బ‌యో బ‌బుల్‌ను మ‌రింత ప‌కడ్బందీగా అమ‌లు చేయ‌నుంది.

సెప్టెంబ‌ర్ 19వ తేదీ నుంచి రెండో ద‌శ ఐపీఎల్ 2021 ఆరంభం కానుండ‌డంతో బీసీసీఐ ఇప్ప‌టికే ఐపీఎల్ ఆట‌గాళ్లు, సిబ్బంది బ‌స చేస్తున్న యూఏఐఈలోని 14 హోట‌ళ్ల‌కు చెందిన 750 మంది సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు చేస్తోంది. వారిని కూడా బ‌యో బ‌బుల్‌లో ఉంచ‌నున్నారు. అలాగే యూఏఈకి చెందిన వీపీఎస్ హెల్త్ కేర్‌తో భాగ‌స్వామ్యం అయిన బీసీసీఐ వారి సంస్థ‌కు చెందిన 100 మంది వైద్య సిబ్బందిని అవే హోట‌ల్స్‌లో బ‌యో బ‌బుల్‌లో ఉంచ‌నున్నారు. దీంతో రోజూ ప‌రీక్ష‌లు చేయ‌డం, బ‌యో బ‌బుల్‌ను నిర్వ‌హించ‌డం తేలిక‌వుతుంది.

100 మంది వైద్య సిబ్బందిలో డాక్టర్లు, న‌ర్సులు, పారామెడిక‌ల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నిషియ‌న్లు ఉంటారు. ఆట‌గాళ్లు లేదా సిబ్బందికి ఏదైనా అవ‌సరం అయితే వారు బ‌య‌ట హాస్పిట‌ల్స్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఒక్కో హోట‌ల్‌లో నిర్ణీత సంఖ్య‌లో వైద్య సిబ్బంది ఉంటారు క‌నుక బ‌యో బ‌బుల్‌కు భంగం క‌ల‌గ‌కుండా ఉంటుంది. అందుక‌నే వైద్య సిబ్బందిని కూడా ఈసారి బ‌యో బ‌బుల్‌లో ఉంచుతున్నారు.

ఇక టోర్నీ సంద‌ర్భంగా గత సీజ‌న్ లో 5 రోజుల‌కు ఒక‌సారి ప్లేయ‌ర్ల‌కు, సిబ్బందికి ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేశారు. కానీ ఈసారి 3 రోజుల‌కు ఒక‌సారి ఆ టెస్టుల‌ను చేస్తారు. రోజుకు 2000 వ‌ర‌కు ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేసే సామ‌ర్థ్యం వీపీఎస్ హెల్త్ కేర్ సంస్థ‌కు ఉంది. అందువ‌ల్లే ఈ సంస్థ‌ను గ‌తేడాది సీజ‌న్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ సంస్థ‌తో క‌లిసి బీసీసీఐ టోర్నీని సాఫీగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఈ ద‌శ‌లో మొత్తం 30,000 వ‌ర‌కు ఆర్‌టీ పీసీఆర్ ప‌రీక్ష‌లు చేస్తారు. ఒక్కో టెస్టు రిజ‌ల్ట్ వచ్చేందుకు 6-8 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది.

ఈ ఏడాది జ‌రిగిన సీజ‌న్ తొలి ద‌శ‌లో కోవిడ్ కేసులు బ‌య‌ట ప‌డ‌డం బీసీసీఐకి త‌ల‌నొప్పిగా మారింది. అందుక‌నే ఈ ద‌శ‌లో ఎలాంటి ఆటంకాలు ఏర్ప‌డ‌కుండా ఉండేందుకు క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. మ‌రి బీసీసీఐ అనుకున్న‌ట్లు సాఫీగా టోర్నీ జ‌రుగుతుందా, లేదా.. చూడాలి.