ఐపీఎల్ ట్రోఫీ మ‌ళ్లీ ముంబైదే.. ఢిల్లీపై ఘ‌న విజ‌యం..

దుబాయ్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ పై ముంబై ఇండియ‌న్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ముంబై అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ఢిల్లీపై ముంబై 5 వికెట్ల తేడాతో గెలుపొంది మ‌రో ఐపీఎల్ టైటిల్‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఈ విజ‌యంలో ఐపీఎల్‌లో ఏకంగా 5 సార్లు ట్రోఫీ సాధించిన జ‌ట్టుగా ముంబై రికార్డు సృష్టించింది.

mumbai indians lift ipl trophy once again

మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 156 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 65 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిల‌వ‌గా, రిష‌బ్ పంత్ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 56 ప‌రుగులు చేశాడు. ముంబై బౌల‌ర్ల‌లో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. కోల్ట‌ర్‌నైల్‌కు 2 వికెట్లు ద‌క్క‌గా, యాద‌వ్‌కు మ‌రొక వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన ముంబై 18.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని ఛేదించింది. 5 వికెట్ల‌ను కోల్పోయి 157 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 68 ప‌రుగులు చేయ‌గా, ఇషాన్ కిష‌న్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 33 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో నోర్జె 2 వికెట్లు తీయ‌గా, ర‌బాడా, స్టాయినిస్‌ల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.