ముంబైని గెలిపించిన పొల్లార్డ్‌.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ముంబై గెలుపు..

ఢిల్లీలో జరిగిన ఐపీఎల్‌ 2021 27వ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్‌ అదిరిపోయే రీతిలో విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌ జట్టు ఆటగాడు కిరన్‌ పొల్లార్డ్‌ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 34 బంతుల్లోనే 87 పరుగులు చేశాడు. దీంతో చెన్నైని ముంబై ఓడించింది. 219 పరుగుల లక్ష్యాన్ని కూడా ముంబై ఛేదించింది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక లక్ష్య ఛేదన కావడం విశేషం.

mumbai win against chennai ipl 27th match 2021

మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి చెన్నైని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. అంబటి రాయుడు (72 పరుగులు నాటౌట్‌, 4 ఫోర్లు, 7 సిక్సర్లు), మొయిన్‌ అలీ (58 పరుగులు, 5 ఫోర్లు, 5 సిక్సర్లు), డుప్లెసిస్‌ (50 పరుగులు, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకున్నారు. ఇక ముంబై బౌలర్లలో పొల్లార్డ్‌కు 2, బుమ్రా, బౌల్ట్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.

ఆ తరువాత బ్యాటింగ్‌ చేసిన ముంబై ధాటిగా ఆడుతూ వచ్చింది. ఈ క్రమంలో వికెట్లను కోల్పోయినప్పటికీ రన్‌ రేట్‌ ఎక్కువగా ఉండడం ముంబైకి కలసి వచ్చింది. పొల్లార్డ్‌ ఒక్కడే ముంబైని విజయ తీరాలకు చేర్చాడు. ఆట చివరి బంతి వరకు వచ్చింది. ఓ దశలో సూపర్‌ ఓవర్‌ కు దారి తీస్తుందేమోనని అనుకున్నారు. కానీ పొల్లార్డ్‌ చివరి రెండు బంతుల్లో 8 పరుగులు తీశాడు. చివరకు ముంబై విజయం ఖాయమైంది. చెన్నై బౌలర్లలో శామ్‌ కుర్రాన్‌కు 3, శార్దూల్‌ ఠాకూర్‌, జడేజా, మొయిన్‌ అలీలకు 1 చొప్పున వికెట్లు లభించాయి.