మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లోనే.? వేదిక‌ల‌పై మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న బీసీసీఐ..

క‌రోనా వ‌ల్ల ఐపీఎల్ 2021 సీజ‌న్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను బీసీసీఐ వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. కోల్‌క‌తా, చెన్నైల‌కు చెందిన ప‌లువురు ప్లేయ‌ర్లు, సిబ్బందికి కోవిడ్ రావ‌డంతో ఐపీఎల్‌ను అక‌స్మాత్తుగా వాయిదా వేశారు. అయితే సీజ‌న్‌లో మిగిలిన 31 మ్యాచ్‌ల‌ను ఎప్పుడు నిర్వ‌హించేది బీసీసీఐ చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే ఈ నెల 29వ తేదీన బీసీసీఐ, ఐపీఎల్ పెద్ద‌లు వ‌ర్చువ‌ల్‌గా స‌మావేశం కానున్నారు. ఆ స‌మావేశంలో ఐపీఎల్ మిగిలిన మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ‌తోపాటు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై కూడా చ‌ర్చించ‌నున్నారు. దీంతో ఆ రెండు టోర్నీల నిర్వ‌హ‌ణ‌పై ఆ స‌మావేశంలో స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

గతేడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ వాయిదా ప‌డింది. దీంతో ఈ ఏడాది భార‌త్‌లో ఆ టోర్నీని నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేశారు. కానీ ప్ర‌స్తుతం కోవిడ్ విజృంభిస్తున్నందున ఓ వైపు ఐపీఎల్ వాయిదా ప‌డింది. దీంతోపాటు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హ‌ణ‌పై సందేహాలు నెల‌కొన్నాయి. అయితే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను బీసీసీఐ యూఏఈలో నిర్వ‌హిస్తుంద‌ని తెలుస్తోంది. అలాగే ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌ను ఇంగ్లండ్‌లో నిర్వ‌హించాల‌ని చూస్తున్న‌ట్లు తెలిసింది.

రానున్న రోజుల్లో భార‌త్ ఇంగ్లండ్‌లోనే ప‌ర్య‌టించ‌నుంది. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను కూడా అక్క‌డే నిర్వ‌హిస్తే బాగుంటుంద‌ని బీసీసీఐ భావిస్తున్న‌ట్లు తెలిసింది. అయితే ఇంగ్లండ్‌లో మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తే భారీగా ఖ‌ర్చు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. క‌నుక బీసీసీఐ ఈ విష‌యంపై ఆచితూచి అడుగులు వేస్తున్న‌ట్లు తెలిసింది. అయితే ఖ‌ర్చు ఒక్క‌టే విష‌యం అయితే మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను యూఏఈ లేదా శ్రీలంక‌లోనూ నిర్వ‌హించే చాన్స్ ఉందని అంటున్నారు. మ‌రి ఈ మూడు వేదిక‌ల్లో దేన్ని బీసీసీఐ ఎంపిక చేస్తుందో చూడాలి.