చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దేవాలయంలో అనధికార విగ్రహాల ఏర్పాటు కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. పుత్తూరుకి చెందిన సూల వర్ధన్, తిరుమలయ్య, ముని శేఖర్ అనే ముగ్గురు అన్నదమ్ములని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గిరికీ వివాహం కాకపోవటంతో జోతిష్యం, మూఢ నమ్మకాలుతో ఆలయంలో శివ లింగం, నంది విగ్రహాలను ప్రతిష్టించినట్లు విచారణలో వెల్లడయింది. తిరుపతిలో ఈనెల 2న విగ్రహాలు చేయించి ఈ నెల 6న ఆలయంలో పెట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు.
సీసీ టీవీ విజువల్స్, ద్విచక్ర వాహనాల నెంబర్లు ఆధారంగా నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలానే నిందితుల నుండి రెండు ద్విచక్రవాహనాలు, మూడు సెల్ ఫోన్ లు సీజ్ చేశారు. ఎస్పీ రమేష్ రెడ్డి ఈమేరకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ ముగ్గురు వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఓ స్వామీజీ సూచన మేరకు ఈ పని చేసినట్టు తెలుస్తోంది.