దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమానికి గత వారం రోజుల నుంచి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. టీకాల నిల్వలు అయిపోయానని రాష్ట్ర ప్రభుత్వాలు గగ్గోలు పెడుతున్నాయి. దీంతో కేంద్రం ఎప్పటికప్పుడు అవసరం అయినంత మేర టీకాలను సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. ఇక మూడో దశ కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మే 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. అందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాలను ఇవ్వనున్నారు.
అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లు, కేంద్రాల్లో ప్రజలకు ఉచితంగా, డబ్బులకు రెండు రకాలుగా వ్యాక్సిన్లను అందించారు. కానీ మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రక్రియలో వ్యాక్సిన్లను ఉచితంగా అందివ్వబోమని కేంద్రం ప్రకటించింది. 18 ఏళ్లకు పైబడిన వారందరూ టీకాలను తీసుకోవాలని చెప్పింది. కానీ టీకాలను ఉచితంగా ఇవ్వలేమని కేంద్రం చెప్పింది. అందువల్ల ఆ నిర్ణయాన్ని రాష్ట్రాలకే కేంద్రం వదిలేసింది. దీంతో ప్రజలకు టీకాలను ఉచితంగా ఇవ్వాలా, వద్దా అన్ని నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రాలపైనే ఆధార పడి ఉంది.
అయితే ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వాలు టీకాలను ఉచితంగానే ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. కానీ టీకాలను ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలపై అదనపు భారం పడుతుంది. ఈ క్రమంలో ఇదే విషయంపై పలు రాష్ట్రాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం టీకాలను ఉచితంగా అందివ్వాలని కోరుతున్నాయి. ఇక ఇదే విషయంపై చత్తీస్‌గఢ్ సీఎం టీఎస్ సింగ్ దియో ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. అలాగే కేరళ సీఎం విజయన్ లేఖ రాశారు. తమిళనాడుతోపాటు పలు ఇతర రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా కేంద్రానికి ఇదే విషయంపై లేఖలు రాశారు. వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. కానీ కేంద్రం ఇకపై టీకాలను ఉచితంగా అందించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరి దీనిపై ఏం జరుగుతుందో చూడాలి.