ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టుకునేందుకే లండన్ వెళ్లాడని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరగనున్న నేపథ్యంలో తాను అక్రమంగా కూడబెట్టిన డబ్బు కోసం లండన్ వెళ్లినట్లు ఆయన తీవ్రంగా విమర్శించారు. సీబీఐ కోర్టు సీఎం జగన్‌కు దావోస్ వెళ్లడానికి మాత్రమే అనుమతిని ఇచ్చిందని.. కోర్టు అనుమతులను కూడా పక్కన పెట్టి లండన్ ఎలా వెళ్లారని ఆయన ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దావోస్‌కు అధికారులతో కలిసి సీఎం జగన్ వెళ్లలేదన్నారు. తన భార్యతోపాటు వీఎస్.భరత్ రెడ్డి, మరొకరితో కలిసి వెళ్లారన్నారు. దావోస్‌లో వారం రోజుల పర్యటన ఉందన్నారు. ఈ పర్యటనకు రూ.9 కోట్లు ఖర్చు కానుందన్నారు. ఇస్తాంబుల్‌లో రీఫిల్లింగ్ జాప్యం వల్లే లండన్ మీదుగా సీఎం జగన్ ప్రయాణిస్తున్నట్లు ఏపీ మంత్రులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండి పడ్డారు. 2019 ఎన్నికల ముందు లండన్ వెళ్లి దాచుకున్న డబ్బును తీసుకొచ్చిన విధంగా.. ఇప్పుడు కూడా వెళ్లారని ఆయన ఆరోపించారు.