పసికూన అయిన పది సంవత్సరాల తెలంగాణ.. మిగతా రాష్ట్రాలతో పోటీ పడుతోంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణ.. కేంద్రం నుంచి అనేక అవార్డులను అందుకుందని కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ప్రారంభించుకున్న అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది కాబట్టే
మంచిర్యాల జిల్లా అయిందన్నారు సీఎం కేసీఆర్.. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్పట్నుంచో ఉందన్నారు. ప్రజలకు మంచి జరగాలనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
అనేక అంశాల్లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని కేసీఆర్ తెలిపారు. అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న తెలంగాణకు.. కేంద్రం నుంచి అనేక అవార్డులు వస్తున్నాయని చెప్పారు. వరిలో పంజాబ్ ను దాటిపోయామని చెప్పిన కేసీఆర్.. గొర్రెల పెంపకంలో మనమే నెంబర్ వన్ స్థానంలో ఉన్నామన్నారు. రెండో విడుత గొర్రెల పంపిణీ పథకాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నామని తెలిపారు.కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్యమంత్రులు కూడా అమలు చేశారని కేసీఆర్ తెలిపారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తున్నామని, కరోనా, నోట్ల రద్దుతో ఇబ్బంది పడినా ముందుకు సాగామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేస్తున్న అధికారులకు అభినందనలు తెలిపారు.