తెలంగాణలో మరోసారి వరణుడు బీభత్సం సృష్టించనున్నాడు. ఇటీవలే ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో వచ్చిన ఇబ్బందుల నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే మరోసారి దాడికి రెడీ అయ్యాడు. రాష్ట్రంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ముఖ్యంగా ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రం వైపునకు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి వీస్తున్నాయని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ నెల 20న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరిత ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోందని స్పష్టం చేసింది. ఈ కారణంగానే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. భారీ వర్షాలు కురియనున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.