ఆ భేటీ తరువాత గ్రేటర్ ఎన్నికలపై నిర్ణయం..!

గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ దిశగా జీహెచ్‌ఎంసీలో కసరత్తు మొదలైంది. పది రోజుల క్రితమే ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు బల్దియా ఎన్నికల విభాగం వివరాలు పంపినట్టు తెలిసింది. ప్రస్తుత ఓటర్లు ఎంతమంది, బీసీ ఓటర్ల గణన, రిజర్వేషన్ల ఖరారు, ఇతరత్రా పనులు పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఉన్నతాధికారులు అడిగారు. డివిజన్ల పునర్విభజన చేయడానికి ఎంత సమయం పడుతుంది..? ఏ ప్రాతిపదికన చేస్తారనే వివరాలూ తీసుకున్నట్టు సమాచారం.

ప్రస్తుతానికి పునర్విభజన ప్రతిపాదన పక్కన పెట్టగా.. కరోనా నియంత్రణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు. వారంలో ఎన్నికల సంఘం కూడా జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశమయ్యే అవకాశాలున్నాయని ఓ అధికారి తెలిపారు. మూడు, నాలుగు రోజుల క్రితమే సమావేశానికి సంబంధించి మౌఖిక సమాచారం అందిందని, త్వరలో అధికారికంగా తేదీ ఖరారయ్యే అవకాశముందని ఆయన చెప్పారు.