తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వివిధ పార్టీలు నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఆ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది.
ప్రవక్తపై దైవదూషణ వ్యాఖ్యలు చేసి అరెస్టయి సస్పెన్షన్‌కు గురైన గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించుకున్నందుకు కాషాయ పార్టీపై మండిపడిన ఒవైసీ, నూపుర్ శర్మకు ప్రధాని నరేంద్ర మోడీ నుండి ఆశీర్వాదం లభిస్తుందని తాను ఖచ్చితంగా అనుకుంటున్నానని విమర్శించారు.
బీజేపీ నేతలు నుపుర్ శర్మ, ఎమ్మెల్యే రాజా సింగ్‌లు ఈ ఏడాది ప్రారంభంలో దైవదూషణ చేసి వివాదం రేపారు. వీరి వ్యాఖ్యలు జాతీయంగానే కాంకుండా ఒక వర్గం నుంచి అంతర్జాతీయంగా ఆగ్రహాన్ని రేపాయి. ఈ క్రమంలోనే వారిని బీజేపీ సస్పెండ్ చేసింది. అయితే, ఎన్నికల నేపథ్యంలో రాజాసింగ్ పై సస్పెన్షన్‌ను బీజేపీ ఎత్తివేసింది. ఎక్స్ లో అసదుద్దీన్ ఒవైసీ చేసిన పోస్టులో.. “ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రియమైన “ఫ్రింజ్ ఎలిమెంట్‌కి రివార్డ్ ఇచ్చారు. నూపుర్ శర్మ కూడా ప్రధానమంత్రి నుండి ఆమె ఆశీస్సులు పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. ద్వేషపూరిత ప్రసంగం మోడీ బీజేపీలో ప్రమోషన్‌కు అత్యంత వేగవంతమైన మార్గం” అంటూ విమర్శించారు.