తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ అదనపు ఎస్పీ భుజంగరావుకు నాంపల్లి కోర్టు తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనారోగ్య కారణలతో కోర్టు 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. గుండె సంబంధిత చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని భుజంగరావు కోర్టులో అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఈ సందర్భంగా కోర్టు కొన్ని షరతులు విధించింది. భుజంగరావు హైదరాబాద్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేశింది. మార్చి 23వ తేదీన ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావును దర్యాప్తు బృందం అరెస్టు చేసి రిమాండ్కు తరిలించిన విషయం తెలిసిందే. ఎస్ఐబీలో హార్డ్‌డిస్క్‌లు ధ్వంసం చేసిన విషయంలో మరో అధికారి తిరుపతన్నతో పాటు భుజంగరావు పాత్ర ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించి మార్చిలో అరెస్టు చేశారు. ప్రతిపక్షాల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారిపై ఎన్నికల సమయంలో దాడులు నిర్వహించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.