పక్కా ప్లానింగ్‌తో బరిలోకి దిగితే ఫలితాలు ఏలా ఉంటాయో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది.ఈ ప్లానింగ్‌కి దూకుడు జోడిస్తే ఇంకా మంచి ఫలితాలను రాబట్టవచ్చు.ఇప్పుడు తెలంగాణ రాష్ర్టంలో అదే జరుగుతోంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని రెండు వారాలు అవుతోంది.14 రోజుల పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు కూడా జరిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అయిన 6 గ్యారంటీలలో ఇప్పటికే రెండు అమలు చేశారు.సంక్రాంతిలోపు మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్తున్నారు.ఇదే క్రమంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై వేటు వేయడం,కీలక పదవుల్లో అనుకూలమైన అధికారులను తీసుకురావడం వంటి కార్యక్రమాలు చకచకా చేస్తున్నారు.
ఈనెల 7న ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రేవంత్‌రెడ్డి. ఇక డిప్యూటీ సీయంగా భట్టి విక్రమార్క తోపాటు మరో 10 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.అదే సమయంలో అధికారులు ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెను తొలగించారు. ప్రగతి భవన్‌కు జ్యోతిరావు పూలే అంబేద్కర్ భవన్‌గా పేరు మర్చారు. సచివాలయంలో చార్జ్ తీసుకున్న మరుసటి రోజు నుంచి ప్రజాభవన్లో ప్రజా దర్బార్‌ను నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది.జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచే ప్రతి రోజు సచివాలయానికి వస్తున్నరేవంత్ ప్రగతి భవన్‌లో ఉండనని తేల్చేశారు. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే రెండు గ్యారంటీలను అమలు పరిచారు.డిసెంబర్ 9న అసెంబ్లీ ఆవరణంలోనే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రోటోకాల్ ప్రకారం సీఎం భవనం వినియోగించుకోక పోవడమే కాదు,సీఎం కాన్వాయ్‌లో కూడా వాహానాల సంఖ్యను 15 నుంచి 9కి తగ్గించుకున్నారు.ఇప్పటికీ సొంత వాహానంలోనే తిరుగుతున్నారు.ఇక కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను ఆపొద్దని ఆదేశాలు జారీ చేశారు.తనను సామాన్య వ్యక్తిలాగా చూడాలని అధికారులకు,పార్టీ నేతలకు,కేడర్‌కు స్పష్టం చేశారు.నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారికి ఉద్వాసన పలికారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి..,నిరుద్యోగులకు భరోసా కల్పించేలా యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలు చేసేలా చర్యలు చేపట్టారు.వెంటనే పోలీస్ కానిస్టేబుల్,హోం గార్డు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశించారు.మొదటి రెండు వారాలు దూకుడుగా వ్యవహరించిన సీఎం రేవంత్‌రెడ్డి అటు హైకమాండ్‌ను కూడా మెప్పించారని సమాచారం.రానున్న ఐదేళ్ళలో ఇదే దూకుడుతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు.