సీపీఎస్‌ రద్దు హామీని పరిశీలిస్తాం : ముఖ్యమంత్రి రేవంత్

-

తెలంగాణలో సీపీఎస్‌ రద్దును పరిశీలిస్తామని, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణ(పీఆర్‌సీ)లో తగిన న్యాయం చేస్తామని మాటిచ్చారు. నాలుగు పెండింగ్‌ డీఏలపై, డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై ఈ నెల 12వ తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఐ)లో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం రాలేదన్న సీఎం, ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలవారీగా సంఘాలు ఉండాల్సిందేనని, ఇద్దరు, ముగ్గురితో కొన్ని రిజిస్టర్డ్‌ సంఘాలుంటాయని తెలిపారు. అలా కాకుండా గుర్తింపు సంఘాలను ఎన్నుకోవాలని, వాటితో మంత్రివర్గ ఉపసంఘం శాఖలవారీగా సమావేశాలు నిర్వహించి నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు. రెగ్యులర్‌ పోస్టుల్లో నుంచి విశ్రాంత ఉద్యోగులను తొలగించి పదోన్నతులకు ఆటంకం లేకుండా చూస్తామని, విశ్రాంత ఉద్యోగుల సేవలు అవసరమనుకుంటే ఓఎస్డీలుగా నియమించుకుంటామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version