మేడారం జాతరకు కూడా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇవాళ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడలో రామోజీ ఫౌండేషన్ సహకారంతో నూతన ఆర్టీఏ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు మంత్రి పొన్నం. కార్యాలయం ప్రారంభం అనంతరం మంత్రి పొన్న ప్రభాకర్, ఇబ్రాహీంపట్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.
రవాణా శాఖ అధికారులతో కలిసి రోడ్డు సేప్టీ పోస్టర్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 6 ఎకరాల స్థలంలో రామోజీ సంస్థల సహకారంతో 2.5కోట్లతో ఆర్టీవో కార్యాలయం ప్రారంభించుకున్నామన్నారు. 2014లో 71 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు కోటి 60 లక్షల వాహనాలు దాటాయి అన్నారు. రోడ్డు సేప్టీ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామని.. వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో రోడ్డు సేప్ట్ కార్యక్రమాలు ముఖ్యమైనవి అన్నారు. గత ఏడాది 22వేల రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 3వేల మంది మరణించారు. రవాణా కార్యాలయంలో లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇతర సేవలను అందిస్తున్నామని తెలిపారు.