తన వాళ్లే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని వై.ఎస్. షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పంజాగుట్ట చౌరస్తాలోని వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు వైఎస్ షర్మిల. అనంతరం మీడియాతో మాట్లాడారు. వండినట్టు తిన్నట్టు కాదు..రాజకీయాలు చేయడం అంటే చిత్తశుద్దితో పాటు ముందు చూపు ఉండాలి. గుండె నిబ్బరం ఉండాలి. ఓపిక కూడా ఉండాలి అని షర్మిల పేర్కొన్నారు.
కేసీఆర్‌ను గద్దె దించడమే తమ లక్ష్యమని అన్నారు. తాను కార్యకర్తలను నిలబెడతానని చెప్పారు. తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై వారికి గౌరవం ఉందని నిర్దారించుకున్న తర్వాతే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చలకు వెళ్లినట్టుగా తెలిపారు. సోనియాతో జరిపిన చర్చలను తాను ఇప్పుడే బయటపెట్టడం సరికాదనిఅన్నారు. అయితే కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయని.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు షర్మిల. వైఎస్సార్‌పై అపారమైన గౌరవం ఉందని సోనియా, రాహుల్ తనతో చెప్పారని షర్మిల పేర్కొన్నారు.