రాష్ట్ర వ్యాప్తంగా తమ సమస్యల పరిష్కారానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మె బాట పట్టిన వేళ వరంగల్ జిల్లాలో ఓ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఖానాపూర్ మండలం రంగాపురం గ్రామ కార్యదర్శి సోనీ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నారు. సమ్మె విరమించి గురువారం విధుల్లో చేరిన సోనీ.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాక పురుగుల మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
మొన్నటి వరకు జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మెలో పాల్గొన్న సోనీ.. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగం పోతుందన్న ఆందోళనతో నిన్న తిరిగి విధుల్లోకి చేరారు. సోనీ మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆసుపత్రికి చేరుకున్న తోటి ఉద్యోగులు.. కంటతడి పెట్టారు. కార్యదర్శులు ఆసుపత్రికి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.
సోనీ.. ఇంటి కోసం రూ.16 లక్షల రుణం తీసుకుందని.. సమ్మె కారణంగా జీతం రాదని.. తీసుకున్న లోన్ డబ్బులు ఎలా కట్టాలని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుందని తల్లి తెలిపారు. కుటుంబ తగాదాలు.. భర్త వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు వెల్లడించారు.