ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ హరీశ్‌చౌదరి, దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ పాల్గొన్నారు. మిగిలిన నాలుగు లోకసభ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వరంగల్ అభ్యర్థిగా కడియం కావ్య దాదాపు ఖరారు చేశారు. ఆమెను ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వరంగల్ నుంచి ఎంపీ బరిలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె అక్కడి నుంచి గులాబీ పార్టీ తరఫున బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇక కాంగ్రెస్లో చేరనున్న కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.
ఇక ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులపై ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏకాభిప్రాయంతో సాయంత్రానికి అభ్యర్థుల వివరాలు సీఈసీకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరుకు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయాలని ఏఐసీసీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ స్క్రీనింగ్ కమిటీ భేటీ అయి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది.