రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానిగా మళ్లీ మోదీ ఉండాలని రాష్ట్ర యువత కోరుకుంటోందని తెలిపారు. జాతీయస్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా ప్రకటించలేదని, తెలంగాణ టికెట్లపై కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. సోమవారం రోజున రాష్ట్ర ఎన్నికల కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీ ఉందని వెల్లడించారు.
“రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు కచ్చితంగా గెలుస్తాం. హైదరాబాద్లో ఎంఐఎం పార్టీని మట్టి కరిపిస్తాం. దేశంలో నరేంద్ర మోదీకి ఎదురు నిలబడే కూటమి ఏది లేదు దేశంలోని ప్రజలు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు. తెలంగాణాలో అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. విజయ సంకల్ప యాత్ర పేరుతో బీజేపీ బస్సు యాత్ర చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు బస్సుయాత్రలు ప్రారంభమవుతాయి. ముఖ్య నేతలు అందరూ పాల్గొనే విధంగా కార్యాచరణ ఉంటుంది. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రలు కొనసాగుతాయి. తెలంగాణ వ్యాప్తంగా 1,025 కిలోమీటర్ల మేర 17 పార్లమెంట్ నియోజకవర్గాలు, 33జిల్లాలు యాత్ర కవర్ చేస్తాం.” అని కిషన్ రెడ్డి తెలిపారు.