కేంద్రంపై బీఆర్ఎస్ పార్టీ యుద్ధానికి సిద్ధం అవుతోంది. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం సహా తెలంగాణపై కేంద్రం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలోనే రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే పంట ఆరబోత కల్లాల నిర్మాణాలపై కేంద్రం కావాలనే రాద్దాంతం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. రైతుల కోసం కల్లాల నిర్మాణానికి ప్రభుత్వం చేసిన సాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులు నిర్మించుకున్న కల్లాలతో కలిగే ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోదీ ప్రభుత్వం మొండి పట్టుపట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్ర వైఖరిపై రేపు చేపట్టే నిరసనల్లో పెద్దసంఖ్యలో పాల్గొనాలని భారాస కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.