సంధ్య థియేటర్ ఘటనపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది.. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు అని ఆయన పేరొన్నారు.
ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు. ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అని పేర్కొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రేవతి కుటుంబానికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. అలాగే ఇక మీదట సినిమాలకు బెనిఫిట్ షో లు ఇవ్వం అని ప్రకటించారు.