కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతు చేపట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రి పదవిలో ఉన్నా సింప్లిసిటీని మాత్రం వదలడం లేదు. చేసే ప్రతి పనిలో తన సింప్లిసిటీని చూపిస్తున్నారు. తాను ప్రజల మనిషినని నిరూపిస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పనికి ప్రజలు మరోసారి ఫిదా అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఆదివాసీ గిరిజన గ్రామం జామినిలో గురువారం రోజున ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అభయహస్తం గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనను మేడం అని కాకుండా సీతక్క అనే పిలవాలని కోరారు. సీతక్క అన్న పిలుపులోనే ఆప్యాయత ఉంటుందని ఎంత ఎదిగినా తాను ప్రజల మనిషినేనని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు కాంగ్రెస్‌ది గడీల పాలన కాదని.. గల్లీ ప్రజల పాలన అని, ప్రజల సంక్షేమాన్ని కోరే పాలన అని సీతక్క అన్నారు.