అది ఎల్బీనగర్. అక్కడ నిత్యం ఉచితంగా బియ్యం అందిస్తుంటారు. ఆపదలో ఉన్నామని ఎవరు వచ్చినా.. నెలకు సరిపడా బియ్యంతో పాటు సరుకులను కూడా అందజేస్తారు. అంతే కాదు పేదోళ్ల ఆకలి తీర్చేందుకు ఆహార ప్యాకెట్లను హైదరాబాద్ గల్లీల్లో పంచుతుంటారు. గాంధీలోని పేషెంట్ల బంధువులకు కూడా కడుపు నింపుతారు. మరి ఇన్ని చేస్తుంది డబ్బన్న వ్యక్తి కాదు.
ఒక ప్రయివేట్ ఉద్యోగి అయిన రాము దోసపాటి. ఆయన నెల సంపాదన మీదే ఆధారపడే వ్యక్తి కానీ మనసున్న మారాజు. గతేడాది లాక్‌డౌన్ అప్పటి నుంచి రైస్ ఏటీఎమ్ ప్రారంభించాడు. కూలీలకు, పని దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి ఆయన సాయం చేస్తుంటాడు. ఇక హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు కూడా ఎంతోమందికి ఉచితంగా బియ్యం, సరుకులు అందించారు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కూడా తన సేవలను ఆపకుండా సాయం చేస్తున్నారు.
ఎవరైనా పనిచేసుకుంటామని వచ్చినా.. వారికి ఏదో ఒక ఉపాధి చూపిస్తుంటాడు. కుట్టు మిషిన్, లేదా టిఫిన్ సెంటర్, చాయ్ దుకాణం ఇలా స్ట్రీట్ బిజినెస్‌లు పెట్టిస్తూ బతుకు మార్గం చూపిస్తుంటాడు. కరోనా వచ్చినోళ్లకు కూడా ఇండ్లకు వెళ్లి మరీ ఆహారం అందిస్తున్నాడు. ఆయనకు ఎవరు ఫోన్ చేసినా వెళ్లి సరుకులు అందిస్తుంటాడు. విరాళాలు సేకరిస్తూ.. వలంటీర్ల సాయంతో సేవలను విస్తృతంగా కొనసాగిస్తున్నాడు. ఎలాంటి స్వార్థం లేకుండా ఇలి సాయం చేయడం గ్రేట్ కదా.