దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా విచారణ వాయిదా పడుతున్న వస్తున్న ఈ పిటిషన్లపై తాజాగా సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రెండు వేర్వేరు కేసుల్లో గత ఉత్తర్వులను పరిశీలించాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గత విచారణ సందర్భంగా నళిని చిదంబరం కేసుతో సుప్రీంకోర్టు జతపరిచింది. పిటిషన్‌ను ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. తుది విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు.
రికార్డును ముందుగా తాము పరిశీలించాల్సి ఉందన్న అత్యున్నత ధర్మాసనం కేసు విచారణను ఈనెల 16వ తేదీకి వాయిదా వేసింది. కవిత సమన్లు తీసుకోవట్లేదని..విచారణకు రావట్లేదని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సమన్లు జారీ చేయబోమని గత విచారణలో చెప్పారని కపిల్ సిబల్ పేర్కొన్నారు. సమన్లు జారీ చేయబోమనేది ఒక్కసారికే కానీ.. ప్రతిసారి కాదని ఈడీ న్యాయవాది వాదించారు. ఈనెల 16న విచారణలో అన్ని విషయాలు పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.