తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోనాల జాతర రాగానే తెలంగాణ ప్రజల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలో బోనాలు ఒకటి. ఈ పండగ ప్రారంభం అయిందంటే చాలు.. నగరంతా మైకులతో మారు మోగుతుంటుంది. ఆలయాలన్నీ అలంకరణలతో దగ దగ మెరిసిపోతుంటాయి. తెలంగాణకు చెందిన వ్యక్తులు ప్రపంచంలో ఎక్కడ స్థిరపడినా బోనాల పండుగ వచ్చిదంటే చాలు ఊర్లలో వాలిపోతుంటారు.
అంతటి మహాత్తరమైన జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతోంది. వచ్చే జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం సందడి షురూ కానుంది. ఆ రోజు నుంచే హైదరాబాద్ మహా నగరంలో బోనాల సంబరం మొదలవుతుంది. గోల్గొండ శ్రీ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజా కార్యక్రమాలు వేడుకగా నిర్వహిస్తారు. ఆ తరువాత రెండో వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల వేడుక నిర్వహిస్తారు. సికింద్రాబాద్ తరువాత వారం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు, ఆదివారాలు నెల రోజుల పాటు హైదరాబాద్ నగరమంతట బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. నగరంలో పూర్తయ్యక వెంటనే గ్రామాల్లో సందడి మొదలవుతుంది.