Telangana Budget 2024 : బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
అయితే రేపు మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను 14, 15 తేదీల్లోనూ నిర్వహించే అవకాశం ఉందని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక అటు తెలంగాణలో గ్రామ స్థాయిలో రెవెన్యూ విభాగాన్ని పటిష్ఠం చేసేందుకు గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. చట్ట పరిమితులు, న్యాయ వివాదాలు, ఇతర విభాగాల్లో చేరిన వీఆర్‌ఏల సర్వీసుల పునరుద్ధరణ వంటి సమస్యలపై అధ్యయనం చేయాలని సర్కార్ నిర్ణయించింది.