తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ కొత్త సర్కార్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఆ తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజా దర్బార్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్‌లోని జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజల నుంచి నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి అర్జీలు స్వీకరించనున్నారు. ప్రజాదర్బార్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొననున్నారు. నేరుగా వారి సమస్యలు విని పరిష్కారానికి కృషి చేస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రజా దర్బార్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మరోవైపు ఆరు గ్యారంటీల్లో 2 అంశాలపై ఇవాళ సీఎం రేవంత్ సమీక్షించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపుపై సమీక్ష నిర్వహించనున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో విద్యుత్ స్థితిగతులపైనా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.