తెలంగాణలో కొత్త లిక్కర్ పాలసీని రాష్ట్ర సర్కార్ ప్రకటించింది. గతంలో మాదిరిగానే 2011 జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజుల్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి 2025 నవంబరు 30 వరకు (రెండేళ్లపాటు) ఈ విధానం అమలులో ఉండనుంది. వచ్చే నవంబరు లేదా డిసెంబరులో శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశముండటంతోనే ముందస్తుగా టెండర్లు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.
రేపటి నుంచి 21వ తేదీలోగా దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. టెండర్లు దక్కించుకున్న వ్యాపారులు ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి మద్యం విక్రయాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ఈసారి మద్యం దుకాణాల లైసెన్స్ రుసుంను గతంలో మాదిరిగానే ప్రభుత్వం ఆరు స్లాబులుగా ఖరారు చేసింది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు రుసుంను రూ.2 లక్షలుగా నిర్ణయించింది. ప్రతి దరఖాస్తుకు విధిగా రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా 2,620 దుకాణాలకు లాటరీ పద్ధతిలో దుకాణదారుల్ని ఎంపిక చేయనున్నారు. మద్యం దుకాణాదారులు ఆరు విడతల్లో లైసెన్స్ రుసుం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.