తెలంగాణలో రేపటితో సర్పంచ్ల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో తక్షణమే వారి నుంచి రికార్డులు స్వాధీనం చేసుకోవాలని గ్రామ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చెక్‌బుక్కులు, డిజిటల్ సంతకాల “కీ”లను తీసుకోవాలని నిర్దేశించింది. ఎవరైనా ఈ ఆదేశాలు పాటించని పక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2వ తేదీ నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారులు బాధ్యతలు చేపట్టునున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో రెండోసారి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. ఫిబ్రవరి రెండో తేదీన విధుల్లో చేరనున్న ప్రత్యేకాధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇవ్వనుంది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఉండగా ఇకపై ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అభివృద్ధి పనులకు సంబంధించి వారిద్దరి సంతకాలతో నిధులు డ్రా చేసుకొని వెచ్చించే వీలుంటుంది. అన్ని మండల కేంద్రాలకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేకాధికారిగా ఉంటారు. మేజర్ గ్రామ పంచాయతీలకు తహసీల్దార్లు, పెద్ద జనాభా గల ఇతర గ్రామాలకు ఎంపీడీవోలు, ఆ తర్వాత జనాభా ప్రాతిపదికన ఉపతహసీల్దార్లు, మండల పంచాయతీ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.